సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తొలి రోజున జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహిన్ జూనియర్ కళాశాలలలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును, విద్యార్థుల హాజరు వివరాలను ఆమె నిశితంగా పరిశీలించారు.
ప్రశ్నాపత్రాల నిర్వహణ, నిబంధనల ప్రకారం వాటిని తెరవడం వంటి అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. సీసీటీవీ నిఘా మధ్య పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయా అని నిర్ధారించుకున్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం (ఏఎన్ఎం), టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను కూడా కలెక్టర్ సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పరీక్షలు ముగిసిన వెంటనే ఆన్సర్ షీట్లను పటిష్టమైన పోలీసు బందోబస్తుతో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. కాపీయింగ్‌కు తావులేకుండా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


