అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జోగిపేట, సంగారెడ్డిలలో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. బాలికలు, కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సూచనల మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. జోగిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, సంగారెడ్డిలోని హనుమాన్ నగర్ పరిధిలోని ఇటుక బట్టీల వద్ద సదస్సులు నిర్వహించారు.
ముఖ్య అతిథి బి. సౌజన్య మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్యవివాహాలను అరికట్టాలని సూచించారు. పోక్సో చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి వివరించి, బాలికలు సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా అన్యాయం జరిగితే భయపడకుండా చట్టపరమైన సహాయం పొందాలని, విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.
జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, పిల్లల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని బి. సౌజన్య తెలిపారు. ఇటుక బట్టీల కార్మికులకు అందుతున్న సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు.
న్యాయపరమైన సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాలను సంప్రదించాలని, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పాండు, జోగిపేట పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, బాలికలు, కార్మికులు పాల్గొన్నారు.












