సంగారెడ్డి, జూలై 23
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్–II ఐజీ షానవాజ్ ఖాసిం, జిల్లా పోలీసుల పనితీరును ప్రశంసించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐజీ, ఎస్పీతో కలిసి మొక్కలు నాటారు, పునరుద్ధరించిన స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్–II ఐజీ షానవాజ్ ఖాసింకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలు పూల మొక్కను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఐజీ, జిల్లా ఎస్పీతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో పునరుద్ధరించిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించి, కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలిస్తూ వాటి పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఐజీ షానవాజ్ ఖాసిం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే జిల్లాను రాష్ట్రంలో ముందువరుసలో నిలపగలమని అన్నారు. సీసీ కెమెరాలను జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని, ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినప్పుడే పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ తనిఖీలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, డీసీఆర్బీ డీఎస్పీ సురేందర్ రెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఎస్హెచ్ఓలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.










