సంగారెడ్డి జిల్లాలో స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలని, నిబంధనలను ఉల్లంఘించే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం (PC & PNDT Act, 1994) అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్, రీన్యూవల్ ప్రక్రియలను నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కేంద్రాలకే ఇవ్వాలని సూచించారు.
గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను ప్రోత్సహించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు తమ రికార్డులను, నివేదికలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వాటిని సంబంధిత వైద్యాధికారులు పరిశీలించాలని ఆదేశించారు. నమోదైన కేసులను విభాగాలవారీగా వర్గీకరించి, కారణాలతో సహా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ స్కానింగ్లు జరగకుండా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించిన వాటిపై తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.












