సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 23 నుండి జూన్ 7 వరకు పలు ఆంక్షలు అమలులో ఉంటాయి. ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, డిజె సౌండ్ వినియోగంపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో, సిటీ పోలీస్ యాక్ట్, 1348 ప్రకారం, మే 23, 2026 ఉదయం 6 గంటల నుండి జూన్ 7, 2026 ఉదయం 6 గంటల వరకు పలు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో, కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని, వీటి నిర్వహణకు ముందుగా సంబంధిత ఏసీపీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే, బంద్ ల పేరుతో సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై కూడా నిషేధాజ్ఞలు విధించారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అయితే, సంబంధిత డివిజన్ ఏసీపీ అధికారుల అనుమతి పొందాలని సూచించారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సిటీ పోలీస్ యాక్ట్, 1861 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ వివరించారు.







