తెలంగాణలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో డిజిటల్, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై సంయుక్త భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida - UF-SNRE) సహజ వనరులు మరియు పర్యావరణ పాఠశాల డైరెక్టర్ డా. కె. రమేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి, తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)తో కలిసి పరిశోధన, విస్తరణ, విద్యా రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం (TDSAC) స్థాపనపై కూడా చర్చలు జరిగాయి.
ఈ ప్రతిపాదిత భాగస్వామ్యం ద్వారా డిజిటల్, ఖచ్చిత వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక పద్ధతులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ప్రతినిధులు వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల అభివృద్ధి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, నీటి వినియోగంలో సమర్థతను పెంచడం వంటి కీలక అంశాలపై కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, తెలంగాణలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి అధిక విలువ కలిగిన పంటల సాగును ప్రోత్సహించడం, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీలు, పరిశ్రమల స్థాపన ద్వారా రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించే అవకాశాలపై సమావేశంలో లోతుగా చర్చించారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించే దిశగా కలిసి పనిచేయాలని ప్రతినిధులు సూచించారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఇలాంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎంతో కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనల అమలుకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మాజీ ANGRU వైస్ చాన్సలర్ డా. ఎస్. రఘువర్ధన్ రెడ్డి, SKLTGHU వైస్ చాన్సలర్ డా. రాజిరెడ్డి కూడా పాల్గొన్నారు.









