రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీ, ఆదివారం నాడు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను ఆవిష్కరించే అవకాశం ఉంది.
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఫలితాల ఖచ్చితమైన సమయం, వేదికపై పూర్తి వివరాలను శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అత్యంత వేగంగా ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేసింది.
ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలనే లక్ష్యంతో, మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించి, ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. గతంలో సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యేవి. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు.
ఫలితాలు త్వరగా విడుదల కావడం వల్ల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ముందుగానే నిర్వహించి, విద్యా సంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులు ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో సకాలంలో ప్రవేశాలు పొందగలుగుతారు.







