రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ క్రమంలో రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నస్పూర్ కలెక్టరేట్లో మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓల ప్రతినిధులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరాపై చర్చించారు.
రైతులకు సరైన సమయంలో, సరైన నాణ్యతతో కూడిన విత్తనాలు అందేలా చూడాలని అధికారులను, డీలర్లను చైర్మన్ ఆదేశించారు. ఈ దిశగా విత్తన సరఫరా ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా విత్తన సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
నాణ్యమైన విత్తనాల లభ్యత రైతులకు అధిక దిగుబడులను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అన్వేష్ రెడ్డి పునరుద్ఘాటించారు.











