తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమస్యలను ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అధికారులు ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో కాలుష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని, మరిన్ని ఆలయాల నిర్మాణం ద్వారా భక్తి భావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు.
అన్నదానం, ప్రాణదానం పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రాణదానం సేవలను విస్తరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు. శ్రీవారి సేవలో పాల్గొనే సేవకులకు వారి నైపుణ్యానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చి, వారి సేవలను టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. టీటీడీలో అమలు చేస్తున్న విధానాలు దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూలైన్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.











