తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 19 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
సాత్తూరు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో, ఫ్యాక్టరీలో రసాయనాలు కలుపుతున్న సమయంలో మంటలు చెలరేగి, అవి వరుస పేలుళ్లకు దారితీసినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం తీవ్రంగా దెబ్బతింది. మృతుల్లో మహిళా కార్మికులు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని విరుధునగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ బాణసంచా యూనిట్ స్థానిక వ్యాపారవేత్త ముత్తు మాణిక్యం పేరు మీద నమోదైనట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు.











