తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన నిప్పురవ్వ చాకలి ఐలమ్మ: టీజీ-ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి

*అధికారికంగా చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి*

*ఐలమ్మకు ఘన నివాళులు*

IMG 20240910 175442

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన నిప్పురవ్వ చాకలి ఐలమ్మ అని టీజీ-ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సంగారెడ్డి పట్టణంలో ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిది అన్నారు. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడపడుచు దొరల దోపిడిని ఎదిరించి నిలిచిందన్నారు. వెట్టి చాకిరీ చేయొద్దని పిలుపునిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. దున్నేవాడిదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. నిజాం పాలనలో వెట్టి చాకిరితో మగ్గిపోయిన అణగారిన వర్గాల బతుకులను బాగు చేయడానికి, పరిరక్షించడానికి తుపాకులు పట్టి నిజాంకు, ఆనాటి దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆమె స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వీరనారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళలు వారిపై జరుగుతున్న అన్యాయాలకు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువచ్చిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ, లాంటి పథకాల ద్వారా అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా రజక సంఘం అధ్యక్షులు నగేష్, సభ్యులు, వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now