Headlines:
-
సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రకటన: ప్రయివేటు పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటం
-
ఉచిత ఇసుక పథకం: వాస్తవ పరిస్థితులు మరియు ప్రభుత్వ బాధ్యత
-
ఇసుక రీచ్‌ల నిర్వహణలో ప్రభుత్వ పాత్ర: సిపిఎం వ్యాఖ్యలు
-
ప్రయివేటు సంస్థలపై ఆధారపడే ఇసుక సరఫరా: ప్రజలకు నష్టం
-
వినియోగదారులకు స్వేచ్ఛ: ఉచిత ఇసుక మరియు వ్యయాలు
ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, స్టాక్ యార్డుల నిర్వహణ, సరఫరా వంటి కీలక బాధ్యతలను ప్రయివేటు ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉచిత ఇసుక విధానానికి సవరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జిఓ.నెం.66తో మార్గదర్శకాలు విడుదల చేసిందని, దానిలో అంశాలు పరిశీలిస్తే ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవడానికి, ప్రైవేటుకు పెద్దపీట వేసేందుకే దీనిని తీసుకువచ్చినట్లు కనబడుతోందని తెలిపారు. ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, స్టాక్‌యార్డు నిర్వహణ, సరఫరా వంటి బాధ్యతలను ప్రయివేటు వాళ్లకు అప్పగించి ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించేలా ఉండడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే పలుసార్లు ఇసుక విధానంలో మార్పు చేసినా సాక్షాత్తూ ముఖ్యమంత్రి బహిరంగంగా అధికార పార్టీ నాయకులను హెచ్చరించినా వినియోగదార్లకు ఇసుక లభ్యత, ధర విషయంలో ఎటువంటి ఉపశమనమూ లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇసుక దందాలో ప్రధాన పాత్రదారులన్నది బహిరంగ రహస్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకొచ్చిన సవరణలు సాధారణ వినియోగదారుల కు ఏమాత్రమూ ఉపయోగపడకపోగా అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. జిఓలో పేర్కొన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీల పేరుతో ఉచిత ఇసుక నిర్వహణ, ధరల నిర్ణయం, నిఘా, నియంత్రణ మొదలగు ముఖ్యమైన విషయాలపై అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల పెత్తనం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులే ఇసుక రీచ్‌లకు వెళ్లి తవ్వించుకొని, లోడ్ చేయించుకోవాలని, అలా చేయలేకపోతే ప్రయివేటు వారికి ఆపరేషన్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతో పాటు ఇతర రుసుములు చెల్లించాలని స్పష్టం చేసిందని, దీనివలన పేరుకు మాత్రమే ”ఉచిత ఇసుక” కానీ ఆచరణలో రకరకాల పేర్లతో వినియోగదారులు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉచిత ఇసుక పథకం నామమాత్రంగా మారే ప్రమాదం ఉందని, ప్రయివేటు ఏజెన్సీలకు కాకుండా ఇసుక సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. నదులు, వాగుల సమీపంలో వినియోగదార్లు బండ్లు, ట్రాక్టర్లతో తమ సొంతానికి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే స్వేచ్ఛ కొనసాగించాలనీ, వారిపై ఎలాంటి వేధింపులూ లేకుండా చూడాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.