*_రాష్ట్రంలో మొదలైన ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..!!_*
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) సందడి వాతావరణం మొదలైంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) ఇప్పటికే షెడ్యూల్ (Schedule) విడుదల చేసింది.
ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదల కానుంది. ఇందులో భాగంగా నేటి నుంచి నామినేషన్ల (Nominations) ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు (Returning Officers) నామినేషన్లను స్వీకరిస్తారు.
అనంతరం ఈ నెల 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 13వ తేదీని నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంటుంది. ఇదే నెల 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. తెలంగాణలో మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, అదే స్థానంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ట ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని చెప్పారు. అంతేగాక నిర్వహణ కోసం పోలింగ్ కోసం రిటర్నింగ్ అధికారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ఈ నామినేషన్లను మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ కలెక్టరేట్ లో, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్ లో స్వీకరించాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బందికి సర్టిఫికెట్లు జారీ చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.