కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి
కుప్పం: యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని.. కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు..
రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమన్నారు. విజన్‌తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని.. ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు.