గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకుల సమీక్ష

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పారదర్శక నిర్వహణకు ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు కార్తీక్ రెడ్డి, రాకేష్ లు అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో శనివారం నాడు గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై జిల్లా నోడల్ అధికారులతో సాధారణ పరిశీలకులు కార్తీక్ రెడ్డి, వ్యయ పరిశీలకులు రాకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన వివిధ ఏర్పాట్లను పరిశీలకులకు వివరించారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసిందని, రేపటి నుండి రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున, అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, నోడల్ అధికారులకు కేటాయించిన విధుల అమలు, ఏర్పాట్ల పురోగతి గురించి పరిశీలకులు ఆయా నోడల్ అధికారులతో వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా నోడల్ అధికారులు తమ తమ బాధ్యతల పరిధిలో చేపట్టిన చర్యలను పరిశీలకులకు వివరించారు. ఈ సందర్భంగా పరిశీలకులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment