*అనధికార డీ-అడిక్షన్ సెంటర్‌పై అధికారుల కొరడా – 17 మంది రోగులను రక్షించి, కేంద్రం సీజ్*
ఈ కేంద్రాన్ని శ్రీ మధు కుమార్ కొర్లపాటి అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతనికి వైద్యపరమైన అర్హతలు లేవని తేలింది. తనిఖీలో ఈ కేంద్రం అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
తనిఖీ సమయంలో కేంద్రంలో 17 మంది రోగులకు అనధికార వ్యక్తులచే చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను సంప్రదించి, ఆ రోగులను వారికి సురక్షితంగా అప్పగించారు. వారిలో ఇద్దరిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇతర గుర్తింపు పొందిన పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఈ కేంద్రంలో అర్హత కలిగిన వైద్యులు ఉన్నారని ప్రజలను తప్పుదోవ పట్టించి, వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు లేదా శారీరక గాయాల నుండి కోలుకోవడానికి రోగులకు మందులు, ఇంజెక్షన్లు ఇస్తూ బెడ్‌లతో కూడిన సౌకర్యంతో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఇది అనధికారికంగా ఒక క్లినిక్ లేదా ఆసుపత్రి వలె నడుస్తోంది.
ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రూల్స్, 2013లోని రూల్ 8(2)(9) మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టంలోని సెక్షన్లు 9, 11, 12(2) లను ఉల్లంఘించింది. రిజిస్ట్రేషన్ లేకుండా డీ-అడిక్షన్ సెంటర్‌ను నిర్వహించడం, అర్హత కలిగిన వైద్య నిపుణులు లేకపోవడం, శిక్షణ పొందిన డాక్టర్లు లేదా నర్సింగ్/పారామెడికల్ సిబ్బంది లేకుండానే ఈ కేంద్రాన్ని నడపడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
పై వాస్తవాల దృష్ట్యా, అనధికార మరియు చట్టవిరుద్ధ వైద్య విధానాల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు, శ్రద్ధా డీ-అడిక్షన్ సెంటర్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్‌ను మరియు దాని నిర్వాహకుడు మధు కుమార్ కొర్లపాటికి సంబంధించిన ప్రాంగణాన్ని తక్షణమే సీజ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఉమా గౌరీ మాట్లాడుతూ, ప్రజలు ఇలాంటి అనధికారిక కేంద్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అర్హత కలిగిన వైద్యులు మరియు రిజిస్టర్డ్ సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (కీసర డివిజన్) డా. సత్యవతి, జిల్లా మహిళా అభివృద్ధి మరియు బాలల సంక్షేమ శాఖ సీడీపీఒ స్వాతి, సూపర్వైజర్ వెంకటేశ్వర రెడ్డి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.