తాడ్వాయి జూనియర్ కాలేజీని సందర్శించిన అధికారులు
— విద్యా ప్రమాణాలు, హాజరు శాతంపై దృష్టి సారించాలని సూచన
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 27
తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం స్పెషల్ ఆఫీసర్ ఒడ్డెన్న, నోడల్ ఆఫీసర్ సలాం, సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠ్య బోధన, హాజరు, విద్యా ప్రమాణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అధికారులు ‘అమ్మ ఆదర్శ’ పనులను కూడా పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. హాజరు శాతం మెరుగుపడేలా ప్రణాళికాబద్ధంగా గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చించాలని ఆదేశించారు.
విద్యా బోధన పట్ల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, విద్యార్థులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యూసుఫ్ హుస్సేన్, అధ్యాపకులు పాల్గొన్నారు.