ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరు
అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 29
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ, హిందూస్తాన్ యూనిలివర్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు APC ఆదేశాల మేరకు ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్దేశించబడిందని తెలిపారు. ఆయిల్ పామ్ పంట సాగు, నాటడం, చీడపీడల నియంత్రణ, మార్కెటింగ్ అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే ఆయిల్ పామ్ రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని అన్నారు.
ఈ రంగంలో ప్రభుత్వం, సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సదస్సులో ఆయిల్ పామ్ పంట యొక్క ఆర్థిక ప్రాధాన్యత, సాగు పద్ధతులు, నీటి వినియోగం, వాతావరణ అనుకూలత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్కెట్ అవకాశాలపై అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, కోపరేటివ్ అధికారి రామ్మోహన్, PACS కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ ప్రతినిధులు, డ్రిప్ ప్రతినిధులు పాల్గొన్నారు.