ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి – కరీంనగర్ లో పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్ కోర్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ
ఆగస్టు 24న వరంగల్ అంబేద్కర్ భవన్‌లో బహిరంగ సభ
ఆదివాసీల హత్యాకాండపై కేంద్రానికి తీవ్ర నిరసన
పోలీస్ క్యాంపులు ఎత్తివేసి తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలి డిమాండ్
వామపక్ష, పౌరహక్కుల, రాజకీయ నాయకులు పాల్గొననున్న భారీ సభ
ప్రశ్న ఆయుధం ఆగష్టు 22
కరీంనగర్ కోర్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈనెల 24వ తేదీ వరంగల్ అంబేద్కర్ భవన్‌లో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మధ్య భారతదేశంలో జరుగుతున్న ఆదివాసీల హత్యాకాండపై తీవ్రంగా స్పందించిన నాయకులు – ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1/70 చట్టం, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలను అమలు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయొద్దని హెచ్చరించారు.
“దేశ సంపద కొంతమంది కార్పొరేట్లదే కాదు, ప్రజలందరిదే” అని స్పష్టం చేశారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులతో పాటు పౌరహక్కుల సంఘాల అధ్యక్షులు, వామపక్ష పార్టీలు, ఆదివాసీ హక్కుల కార్యకర్తలు పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మార్వాడి సుదర్శన్, బాలసాని రాజయ్య, నారా వినోద్, జిందం ప్రసాద్, భారతి నాయక్, వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, రైతులు, మహిళా దళిత సంఘాలు అందరూ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.