దేశ సంపదను దోచుకునేందుకే ఆపరేషన్ కగార్
– మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను బలిగొంటున్న కేంద్రం
– అటవీ సంపద, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పగించే ప్రణాళిక
– వెంటనే ఆపరేషన్ కగార్ ను ఆపాలి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
ఒంగోలు ఫోటో. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరయ్య
మావోయిస్టులతో పోరాడే సాకు తో ఆపరేషన్ కగార్ పేరుతో పారా మిలటరీ జలాలను అడవుల్లోకి దింపి అమాయక ఆదివాసులను చంపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ అడవులలో జీవించే ఆదివాసులను తరిమికొట్టి అటవీ ఖనిజ సంపదలు, ప్రకృతి వనర్లను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే లక్ష్యంగా భూతకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని, అమాయక ఆదివాసి గిరిజనులు ఊచకోచకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టు పార్టీల నాయకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆపరేషన్ కగార్ ఆదివాసీల అణిచివేత చత్తీస్గడ్, అబూజ్ మడ్ ప్రాంతంలో మొత్తం నాలుగు వేల చదరపు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కొనసాగుతుందన్నారు. ఇందులో 237 గ్రామాలలో గోండు, మోదియా, హౌస్, హల్వా తెగలకు చెందిన 35 వేల మంది ఆదివాసీల జీవిస్తున్నారని, అక్కడ ఈనప ఖనిజం, గ్రాఫైట్ సున్నపురాయి, యురేనియం తదితర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, వాటిని కార్పోరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం 14 ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నారు. ఈ ఒప్పందం అమలులో భాగంగానే మోడీ ప్రభుత్వం అమాయక ఆదివాసీలపై హత్యాకాండని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 400 మంది ఆదివాసీలు మరణించారని ప్రభుత్వ లెక్కలు చెబుతుందన్నారు. ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా చట్టసభలలో, సభల బయట సిపిఐ పోరాటం సాగిస్తుందన్నారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు పాల్గొన్నారు.