ఆపరేషన్ ముస్కాన్ – 11: బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయాలి – మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్

*ఆపరేషన్ ముస్కాన్ – 11: బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయాలి – మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్*

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 01

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే కాకుండా, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే వరకు బాధ్యతగా వ్యవహరించాలని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఆపరేషన్ ముస్కాన్-11 సమీక్షా సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాను బాల కార్మికులు లేని జిల్లాగా మార్చేందుకు జిల్లా కలెక్టర్, వివిధ జిల్లాల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు.

జిల్లా బాలల కమిషన్ సభ్యురాలు సరిత మాట్లాడుతూ, బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ జిల్లా శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలోని పారిశ్రామిక వాడలను బాల కార్మికులు లేని ప్రాంతాలుగా మార్చాలని కలెక్టర్ మను చౌదరి అధికారులకు సూచించారు.

జిల్లాలో గుర్తించిన పది బాలల సంరక్షణ కేంద్రాల వివరాలను ‘మిషన్ వాత్సల్య పోర్టల్’లో అప్‌లోడ్ చేయాలని, ఆపరేషన్ ముస్కాన్-11లో భాగంగా జవహర్ నగర్, సూరారం వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ రాజారెడ్డి మాట్లాడుతూ, జూలై నెలలో రక్షించిన పిల్లల కోసం 24/7 అందుబాటులో ఉంటామని తెలియజేశారు. జిల్లా సంక్షేమ అధికారిణి శారద మాట్లాడుతూ, బాల కార్మికులు, భిక్షాటన చేసే పిల్లలు, అనాథలు, వదిలివేయబడిన పిల్లలను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.

పారిశ్రామిక వాడల్లో లేదా ఇతర పని ప్రదేశాల్లో బాల కార్మికులు కనిపించినట్లయితే, వెంటనే 1098 లేదా 100 నంబర్‌లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్‌మెంట్, డి.ఎం.హెచ్.ఓ ఉమా గౌరి, పంచాయతీరాజ్ అధికారి, డి.ఇ.ఓ విజయ్ కుమారి, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, మల్కాజ్‌గిరి ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఎక్సైజ్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రామ్మోహన్, బి.ఆర్.బి కోఆర్డినేటర్ తిరుమల దేవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ మరియు వారి సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment