హైదరాబాద్: తన ఇల్లు విషయంలో వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. మధురానగర్‌లో తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ‘‘సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. 44 ఏళ్ల క్రితం మా నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. కృష్ణకాంత్ పార్క్‌కు మా ఇంటికి మధ్య వేలాది ఇళ్లు ఉన్నాయి. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్‌పరిధిలోకి రావు. మా ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది’’ అని తెలిపారు.