- ఏండ్ల తరబడి వెట్టి చాకిరి… సీఎం హామీ కలగానే మిగిలిందా..?
- సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన – రెగ్యులరైజేషన్ ఎప్పుడు..?
- రాష్ట్రంలో 15 ఏండ్లుగా 19,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో శ్రమ
- ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మాకేం లాభం..? ఉద్యోగులు ప్రశ్న..
- 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న సీఎం హామీ ఎక్కడ…?
- సమ్మె ఒప్పందం అమలు లేకపోవడం, జీతాల మినహాయింపుపై ఆగ్రహం
- “సమాన పని – సమాన వేతనం” తీర్పు గుర్తు చేస్తున్న ఉద్యోగులు
హైదరాబాద్: “పాలకులు మారారు కానీ మా బతుకులు మారలేదు” – ఇదే ఆవేదన తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 19,600 మంది ఉద్యోగులది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికై అప్పటి నుంచే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామని, ప్రత్యేక తెలంగాణా వస్తే రెగ్యులర్ చేస్తామన్న హామీ కలగానే మిగిలిపోయిందని బాధపడుతున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసినట్లు మాకు కూడా అదే జరుగుతుందని ఆశించామని ఉద్యోగులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా, ఇప్పటి వరకు అమలు కాలేదని వాపోతున్నారు.
ఎనిమిది నెలల క్రితం నెలరోజులపాటు సమ్మె చేసి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నాం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. అంతేకాక సమ్మె కాలపు జీతం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు.
ప్రధాన డిమాండ్లు
- 1. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి.
- 2. అప్పటివరకు వెంటనే పే స్కేలు అమలు చేయాలి.
- 3. పార్ట్‌టైమ్ ఇన్స్పెక్టర్లకు 12 నెలల వేతనం ఇవ్వాలి.
- 4. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% వెయిటేజ్ కల్పించాలి.
- 5. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి.
ఉద్యోగులు సుప్రీంకోర్టు ఇచ్చిన “సమాన పని – సమాన వేతనం” తీర్పును గుర్తు చేస్తూ, పంజాబ్, హర్యానా, సిక్కిం, అస్సాం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష సిబ్బంది క్రమబద్ధీకరణ జరిగిందని, తెలంగాణలో కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“పేద, బడుగు పిల్లల విద్య కోసం మేము కష్టపడుతున్నాం… కానీ మాకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు” అని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, స్టేట్ సెక్రటరీ డి. సత్యనారాయణ గళమెత్తారు.