Site icon PRASHNA AYUDHAM

మసూద్ అజర్ ఆచూకీ తమకు తెలియదన్న పాక్ నేత బిలావల్ భుట్టో

IMG 20250705 WA1348

మసూద్ అజర్ ఎక్కడున్నాడో చెప్తే అరెస్ట్ చేస్తాం.. భారత్‌కు బిలావల్ భుట్టో వింత ఆఫర్

మసూద్ అజర్ ఆచూకీ తమకు తెలియదన్న పాక్ నేత బిలావల్ భుట్టో

భారత్ సమాచారమిస్తే అరెస్టు చేస్తామంటూ వ్యంగ్య వ్యాఖ్యలు

అజర్ బహుశా అఫ్గానిస్థాన్‌లో ఉండొచ్చని అనుమానం

భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్ మరోసారి తన వింత వాదనను తెరపైకి తెచ్చింది. అజర్ ఆచూకీ తమకు తెలియదని, ఒకవేళ భారత్ కచ్చితమైన సమాచారం ఇస్తే సంతోషంగా అరెస్టు చేస్తామని ఆ దేశ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మసూద్ అజర్ ఎక్కడున్నాడో తాము గుర్తించలేకపోతున్నామని, గత పరిణామాలను బట్టి చూస్తే అతడు బహుశా అఫ్ఘనిస్థాన్‌లో ఉండి ఉండవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అతడు పాకిస్థాన్ గడ్డపైనే ఉన్నట్టు భారత ప్రభుత్వం తమకు కచ్చితమైన సమాచారం అందిస్తే, సంతోషంగా అరెస్టు చేస్తామని అన్నారు. అదే సమయంలో, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడనే వార్తలను ఆయన ఖండించారు. సయీద్ తమ కస్టడీలోనే ఉన్నాడని స్పష్టం చేశారు.

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ దాడికి ప్రతీకారంగా, భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పీవోకేలోని జైషే, లష్కరే ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తమ కుటుంబానికి చెందిన 10 మంది మరణించారని మసూద్ అజార్ వాపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో బిలావల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారత్‌లో జరిగిన అనేక భీకర దాడుల సూత్రధారి అయిన మసూద్ అజర్‌ను 2019లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో విమానం హైజాక్ చేసి ఉగ్రవాదులు అతడిని విడిపించుకున్నప్పటి నుంచి పాకిస్థాన్‌లోనే ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

 

 

Exit mobile version