సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు—ఇంద్రేశం రోడ్డు కంకర తేలి గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు ప్రయాణం గగనంలా మారింది. ప్రతి రోజు ఈ రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రోడ్డుపై భారీ ఎత్తున గుంతలు ఏర్పడగా.. గుంతలకు మరమ్మతులు చేయడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే రోడ్డుపై ఉన్న గుంతలలో నీరు చేరి బురద మయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంద్రేశం నుంచి పటాన్ చెరు వైపు వెళ్లే మూడు కిలో మీటర్లు రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. అదేవిధంగా గుంతలతో పాటు బురద మయంగా మారిన రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో టిప్పర్లు పెద్ద ఎత్తున తిరుగుతుండడంతో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.