మహారాష్ట్రలోనూ పని చేసిన పవన్ మ్యాజిక్
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూ వాటా ఉంది. ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో బీజేపీ తరపున ప్రచారం చేశారు. తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న పూణె, బల్లాల్ పూర్, షోలా పూర్, తాలూర్, డెగ్లూర్ లాంటి నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. రోడ్ షోలు నిర్వహించారు. ఈ అన్ని చోట్లా.. బీజేపీ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. పవన్ రోడ్ షోలకు అక్కడ భారీ స్పందన కనిపించింది. పవన్ సనాతన ధర్మం గురించీ, హిందుత్వం గురించి తన ప్రసంగాలు అక్కడి ఓటర్లని బీజేపీ వైపు చూసేలా చేశాయి. ఆ ప్రభావం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
పవన్ కు మోదీ ముందు నుంచీ తగిన ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. ఏపీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కల్యాణ్‌కు తగిన ఎలివేషన్లు ఇస్తుంటారు. పవన్ క్రేజ్ ని నార్త్ లోనూ వాడుకోవాలన్నది మోడీ ఆలోచన. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ని రంగంలోకి దించడానికి కారణం అదే. బీజేపీకి పవన్ ను బ్రాండ్ అండాసిడర్ గా మార్చే ప్రయత్నంలో మోడీ ఓరకంగా సక్సెస్ అయ్యారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ప్రచారం కోసం పవన్ ని రంగంలోకి దింపే ఆలోచన ఆయనకు ఉంది. ఇప్పటికైతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తన మానియా చూపించగలిగాడు. ఆంధ్రాలో ఎలాగైతే 100 % స్ట్రయిక్ రేట్ తో జనసేనని గెలిపించాడో, అలానే మహారాష్ట్రలోనూ తాను ప్రచారం చేసిన ప్రతీ చోటా బీజేపీ జెండా ఎగరేసేలా చేశాడు.