డ్వాక్రా మహిళలకు భారీ రుణాలు అందుబాటులోకి: పీడీ శ్రీధర్ రెడ్డి
స్వయం ఉపాధి యూనిట్లతో ఆర్థిక స్వావలంబన సాధించాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం న్యూస్) డిసెంబర్ 18
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో నిర్వహించిన డ్వాక్రా (DWCRA) మహిళా సంఘాల సమావేశంలో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం భారీ రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. డ్వాక్రా సమాఖ్య మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, తీసుకున్న రుణాలను వాయిదా ప్రకారం 100 శాతం చెల్లించాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. స్వయం ఉపాధి యూనిట్లు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా సంఘాల ద్వారా మాత్రమే కాకుండా శ్రీనిధి పథకం కింద వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, వార్డు నిర్వాహకులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.