పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి: టిఎస్ యుటిఎఫ్ డిమాండ్

ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయాలి – పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి: టిఎస్ యుటిఎఫ్ డిమాండ్

పిఆర్సీ అమలు గడువు ముగిసి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని టిఎస్ యుటిఎఫ్ తీవ్రంగా వ్యతిరేకించింది. 2023 జూలై 1వ తేదీ నుంచి పిఆర్సీని అమలు చేసి, 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పదవీవిరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని సంఘం డిమాండ్ చేసింది.

ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో చావ రవి అధ్యక్షతన రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. సమస్యలపై స్పందించకపోతే ఉద్యమానికి సిద్దంగా ఉండాలని సూచించారు.

రాష్ట్ర మంత్రివర్గం ప్రతి నెల రూ.700 కోట్ల బకాయిలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, గత నెల కేవలం రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయించిన ప్రకారమే మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అదనంగా సంఘం పలు కీలక డిమాండ్లు చేసింది:

గురుకులాల పనివేళలను శాస్త్రీయంగా సవరించాలి.

మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దతి ద్వారా వేతనాలు చెల్లించాలి.

కెజిబివి, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలి.

డిఈఒ, డిప్యూటీ ఈఒ, ఎంఈఒ, డైట్ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయాలి.

పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత అధికారులకే అప్పగించాలి.

వేసవిలో చేపట్టాల్సిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి షెడ్యూల్ ప్రకటించాలి.

సిపిఎస్ రద్దు చేయాలి.

2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని అన్నారు. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రభుత్వం చొరవ చూపాలి, “ఊరి బడి”ను సమాజం కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.

ప్రీ-ప్రైమరీ తరగతులు, 11, 12 తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలను స్వాగతించిన సంఘం, అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించిన తర్వాతే వాటిని అమలు చేయాలని సూచించింది. అంతేగాక ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని పాఠశాల విద్యలోకి రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ మాట్లాడుతూ జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఆగస్టు 1 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఈపీ, సిపిఎస్ వ్యతిరేక సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 8,9,10 తేదీల్లో కోల్కతాలో జరగనున్న స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI) రజతోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిహెచ్ దుర్గా భవాని, టి లక్ష్మారెడ్డి, రాములు, రాజశేఖరరెడ్డి, శాంతకుమారి, నాగమణి, రంజిత్ కుమార్, రాజు, మల్లారెడ్డి, శ్రీధర్, రవికుమార్, రవిప్రసాద్ గౌడ్, జ్ఞాన మంజరి, సింహాచలం, వెంకటప్ప, యాకయ్య, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now