వానలే వానలు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..
ప్రశ్న ఆయుధం 25జులై హైదరాబాద్ :
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ ఈ ప్రాంతాల్లో..
తెలంగాణలో గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ఏం.మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
కాగా భూపాలపల్లి, కరీంనగర్, కుమరం భీమ్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో మోస్తరు వర్ష సూచన ఉందని తెలిపారు. ఇక హైదారబాద్ విషయానికొస్తే గురువారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలోనూ వనాలే వనాలు..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఏలూరు, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లూరి జిల్లాలో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. వచ్చే మూడు రోజుల్లో ఉత్తరకోస్తాలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు.. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఉత్తరకొస్తా తీరం వెంబడి 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మరో మూడు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.