వ్యక్తిగత వివరాలివ్వడానికి నిరాకరిస్తున్న ప్రజలు

సర్వే కష్టాలు

– వ్యక్తిగత వివరాలివ్వడానికి నిరాకరిస్తున్న ప్రజలు

– పలు చోట్ల ఎన్యుమరేటర్లకు ఎదురు ప్రశ్నలు

– పథకాలు రద్దవుతాయేమోనని తప్పుడు సమాచారం

– అప్పులు చెబుతున్నారే తప్ప ఆస్తుల వివరాలివ్వడం లేదు

– సమాచార కచ్చితత్వంపై అనుమానాలు

– ఇప్పటికి 50 శాతం కూడా పూర్తి కాని వైనం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో సర్వేకి వెళ్లిన మహిళా గణకులపై కుక్కలను వదిలారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అపురూప, రమ్యశ్రీలు అరోరా కాలనీలో ఓ కుటుంబ వివరాలు నమోదుచేయడానికి వెళ్లిన సందర్భంలో ఎదురైన చేదు అనుభవమిది. దీంతో భయాందోళనకు గురై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వరంగల్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్న కుటుంబాల వివరాలు నమోదు చేయడానికి వెళ్లిన వారిని సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించలేదు. కరీంనగర్‌లో ఓ ఇంటి యజమాని వివరాలు ఇవ్వక పోగా గణకుల ఐడీ కార్డులతో పాటు వారి ఫొటోలు తీసుకుని పంపించారు. వివరాలు నమోదు చేసుకునే క్రమంలో వారికి కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వడం లేదు. కుటుంబ సర్వే మొదలైన నవంబర్‌ 6 నుంచి రాష్ట్రంలో గణకులకు ఎదురవుతున్న చేదు అనుభవాలలో ఇవి మచ్చుకు కొన్నే…’. పూర్తి వివరాలు చెబితే తమ పథకాలు ఎక్కడ రద్దవుతాయేమోననే ఆందోళనతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మరి కొన్ని చోట్ల తప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా సర్వే నత్త నడకన సాగుతోందని గణకులు అంటున్నారు. సర్కార్‌ అంచనా ప్రకారం ఇప్పటి వరకు 50 శాతం కూడా సర్వే పూర్తి కాలేదని సమాచారం.

సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో గణకులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యంతరాలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలోకి రాకుండా కొన్ని చోట్ల యజమానులు అడ్డుకుంటుండగా, మరి కొన్ని చోట్లైతే వారికి చీత్కారాలు తప్పడం లేదు. ఐడీ కార్డులు లాక్కొని ఫొటోలు తీసుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. తమ వ్యక్తిగత వివరాలను ఎందుకివ్వా లంటూ ఎన్యుమరేటర్లకు ఎదురు తిరుగుతున్నారు. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుండగా, కుటుంబ సర్వేపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, కార్లు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయంటూ సోషల్‌ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వాటిని చూసిన జనాలు ఎన్యుమరేటర్లకు సహకరించకుండా, సర్వే సాఫీగా సాగకుండా అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్రజలు తమ కులం చెప్పడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం పన్ను కట్టేవారు సైతం వివరాలు ఇవ్వడంం లేదు. కొంతమంది సొంత ఇల్లు ఉన్నా, అద్దె ఇంట్లో ఉంటున్నామని చెబుతున్నట్టు ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.

కొన్ని చోట్ల ఇండ్లకు తాళం వేసి ఉంటున్నాయి. ఒక వేళ ఇంట్లో పెద్దలు ఉన్నా గణకులకు సరైన సమాధానం లభించడం లేదు. రుణాలు, ఆధార్‌కార్డులు, ధరణి పాసు పుస్తకాలపై సరైన సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. చాలా మంది మహిళలు తాము చేస్తున్న పనికి బదులు రోజువారి కూలీగా పని చేస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలో సేకరించిన సమాచార కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వేపై తప్పుడు ప్రచారం: ప్రభుత్వం

సర్వేపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం అంటోంది. సేకరించిన సమాచారం చెప్పటం వల్ల ఎవరికీ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవనీ, కొత్తగా మరిన్ని పథకాలు ఇచ్చేందుకే వివరాలు తీసుకుంటున్నామని సర్కార్‌ చెబుతోంది. భవిష్యత్‌లో ప్రజలకు ఉపయోగపడేలా, పారదర్శకంగా సేకరిస్తున్నామని పేర్కొంటున్నది. సర్వేకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదనీ, మంత్రి వర్గ తీర్మానం, అసెంబ్లీ ఆమోదం తర్వాతే చేస్తున్నామని వివరణ ఇస్తోంది. సర్వేలో సేకరించిన సమాచారం ఎలాంటి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాదని అంటోంది. సర్వే ఓ చారిత్రాత్మక కార్యక్రమమనీ, అందరూ సహకరించాలని ప్రభుత్వం అంటోంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేవారిపై కఠిన చర్యలు ఉంటాయనీ, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది. కాగా గత నవంబర్‌ 6 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 శాతం సర్వే పూర్తైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

2014 సర్వే సమాచారం ఏమైంది?

తెలంగాణ ఏర్పడ్డ ఏడాది 2014 ఆగస్టు 19న అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. భారత దేశ చరిత్రలో ఇలాంటి సర్వే మునుపెన్నడూ జరగలేదని ఆ రోజుల్లో చర్చ జరిగింది. 3.85 లక్షల మంది గణకులు, 1.3 కోట్ల కుటుంబాలకు చెందిన సమాచారాన్ని సేకరించారు. ఒకే రోజు అంత పకడ్బందీగా సర్వే నిర్వహించారు.

సర్వే జరిగే రోజు ఇంట్లో లేకుంటే తాము తెలంగాణ వాసులం కాకుండా పోతాం అనేంతంగా ప్రచారం జరిగింది. దాంతో దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులంతా కాలినడకనుంచి మొదలుకుని సైకిళ్లు, వాహనాలు, విమానాలు ఏది అందుబాటులో ఉంటే దాన్ని పట్టుకుని స్వగృహాలకు చేరుకున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, భూ యాజమాన్యం, వృత్తికి సంబంధించి ఎనిమిది అంశాలపై 94 ప్రశ్నలతో కుటుంబ సమాచారాన్ని సేకరించారు. అయితే ఇప్పటికీ ఆ సర్వే అంతు చిక్కని రహస్యమే. ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా మళ్లీ అలాంటి సర్వేనే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదలు పెట్టడంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని ఫలితమే ఈ చేదు అనుభవాలు. సర్వే ఎందుకు చేస్తున్నారు? ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు? అనే విషయాలను ప్రజలకు వివరించకుండా చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సర్వే ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి వివరాలు ప్రజల ముందుంచాల్సిన అవసరముంది.

Join WhatsApp

Join Now