ప్రజలు స్వచ్ఛతపై దృష్టి సారించాలి: కలెక్టర్ మను చౌదరి

ప్రజలు స్వచ్ఛతపై దృష్టి సారించాలి: కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 28:

ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని, ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.

సోమవారం కూకట్‌పల్లి మండలం మూసాపేట్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఉమా గౌరీతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలున్న ప్రజలు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెరుగైన వైద్య సేవలు పొందేలా వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

యు పి హెచ్ సి లో రోజువారీ ఓపీ (ఔట్ పేషెంట్) రోగుల సంఖ్య, వారి నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆన్‌లైన్‌లో పరిశీలించారు. ఏఎన్‌సీ (యాంటెనాటల్ కేర్), బీపీ (రక్తపోటు), షుగర్ పరీక్షల కోసం రోగులు క్రమం తప్పకుండా వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీజనల్ వ్యాధులపై ఇంటింటి ఫీవర్ సర్వేలు, డెంగ్యూ పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను మెడికల్ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల ఓపీ నమోదు రిజిస్టర్‌లను పరిశీలించిన కలెక్టర్, ప్రతిరోజు ఎంతమంది ఓపీ రోగులు వస్తున్నారని ఆరా తీశారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించి, మందుల గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్)లను జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. టీబీ, లెప్రసీ, ఎన్‌సీడీ (నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్) కేసుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్, ప్రతిరోజు ఎన్ని టెస్టులు చేస్తున్నారని అడిగారు. యు పి హెచ్ సి బోర్డు పేరు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని మెడికల్ ఆఫీసర్‌కు కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now