ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలి వైద్యారోగ్య శాఖ మంత్రి ..
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. వాటి బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నారు. వైద్య కళాశాలల అనుబంధ బోధనాసుపత్రుల పనితీరుపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రి¨స్టినా జడ్ చోంగ్తూ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, డీఎంఈ ఎన్.వాణి, వివిధ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ బోధనాసుపత్రుల్లో సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వైద్య పరికరాలు దెబ్బతింటే వెంటనే బాగు చేయించాలని, మరమ్మతుల సాకుతో రోగులను బయటకు పంపవద్దని స్పష్టంచేశారు. రోగుల సంఖ్యకు తగినట్లు పరికరాలు ఉండాలని, అవసరమైన ఆసుపత్రులకు కొత్తవి మంజూరు చేయాలని కార్యదర్శికి సూచించారు. కొన్ని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో(ఎంసీహెచ్) స్కానింగ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని.. అవసరమైతే స్కానింగ్ యంత్రాల సంఖ్య పెంచాలన్నారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. నిజామాబాద్ ఆసుపత్రి నుంచి బాలుడి కిడ్నాప్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో రాత్రిపూట భద్రతను మరింత పటిష్ఠం చేయాలన్నారు. నిర్మల్ ప్రభుత్వ దవాఖానాలో అగ్ని ప్రమాదంపై మంత్రి ఆరా తీశారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలి వైద్యారోగ్య శాఖ మంత్రి ..
by kana bai
Updated On: October 23, 2024 11:09 am