ప్రజలు స్వదేశీ వస్తువులనే వినియోగించాలి : అశోక్ జీ
స్వదేశీ వస్తువుల కొనుగోలు – అమ్మకాలు తప్పనిసరి : పిలుపు
విదేశీ ఉత్పత్తులకు బహిష్కరణ – చైనా, అమెరికా, టర్కీ లక్ష్యం
దేశ ఆర్థిక వ్యవస్థ బలపరిచే మార్గం స్వదేశీ : వ్యాఖ్య
వ్యాపార మార్గాలు, కరెన్సీలు ఆయుధాలుగా మారుతున్నాయన్న అశోక్ జీ
స్థానిక ఉత్పత్తులు, ప్రోత్సహించాల్సిన అవసరం
ప్రశ్న ఆయుధం..కామారెడ్డి, ఆగస్ట్ 17:
ప్రజలు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు, అమ్మకాలు జరపాలని స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ రాష్ట్ర సహా సంయోజక్ అశోక్ జీ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. రానున్న కార్యక్రమాలపై విస్తృత చర్చ జరిపారు.
తరువాత విలేకరులతో మాట్లాడిన అశోక్ జీ, “ప్రజలు తప్పనిసరిగా స్వదేశీ వస్తువులనే వినియోగించాలి. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి ట్రంప్ టారిఫ్‌లకు సమాధానం చెప్పాలి” అన్నారు. చైనా, అమెరికా, టర్కీ ఉత్పత్తులను బహిష్కరించి దేశభక్తిని చాటాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార మార్గాలు, చెల్లింపు విధానాలు, కరెన్సీలు ఆయుధాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు అధిక పన్నులు, అడ్డంకులతో ఎగుమతులను అడ్డుకుంటున్నాయన్నారు. మరోవైపు చైనా తక్కువ ధరల నాసిరకం ఉత్పత్తులతో భారత తయారీ రంగాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, శత్రుత్వ దేశాల ఉత్పత్తులకు బహిష్కరణ, స్థానిక ఉత్పత్తులు–శిల్పులను ప్రోత్సహించడం, భారత విద్యా వ్యవస్థ బలోపేతం చేయడం దేశ ఆర్థిక శక్తిని పెంచి, స్థానిక ఉపాధిని విస్తరిస్తుందని అశోక్ జీ స్పష్టం చేశారు.