కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పేకాట దందాపై పోలీసులు గట్టి దాడులు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పేకాట దందాపై పోలీసులు గట్టి దాడులు

 

— 82 కేసులు నమోదు – 469 మంది అరెస్ట్‌

₹10.40 లక్షల నగదు, 321 మొబైల్‌ఫోన్లు, 45 బైకులు స్వాధీనం

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం)అక్టోబర్‌ 21

 

 

 

జిల్లాలో చట్టవ్యతిరేక పేకాట కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో 18వ తేదీ నుండి ఇప్పటివరకు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 82 కేసులు నమోదు చేసి 469 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

వారి వద్ద నుంచి ₹10,40,089 నగదు, 321 మొబైల్ ఫోన్లు, 45 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరాలను గుర్తించి పైనుండి కంటిన్యూగా నిఘా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

జూదం (పేకాట) వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం తీవ్రంగా దెబ్బతింటుందని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. “ఇది అప్పుల పాలవ్వడం, ఆర్థిక క్షీణత, కుటుంబ కలహాలు, నిరాశ వంటి సమస్యలకు కారణమవుతోంది. చివరికి జీవితాన్ని సైతం నాశనం చేసే దిశగా నెడుతుంది,” అని ఆయన అన్నారు.

 

జూదాన్ని నిరోధించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. కుటుంబ శాంతి, సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నుండి దూరంగా ఉండాలని, పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

 

అలాగే గ్రామాలు, పట్టణాలు, ఫామ్‌హౌస్‌లు, ఇళ్లలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పేకాట లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్‌ 87126 86133, 100 డయల్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment