ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే టూరిస్టులకు పోలీసుల హెచ్చరిక
గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండల పరిధిలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద ములుగు పోలీసులు సోమవారం హెచ్చరిక సూచిక జారీ చేస్తూ బ్యానర్ ను ఏర్పాటు చేసారు. ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై విజయ్ కుమార్ మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు పోలీసుల అనుమతులు లేకుండా ప్రాజెక్టులో ఈతకు వెళ్లడం గాని సెల్ఫీలు దిగడం కానీ చేయవద్దని సూచించారు. ప్రజలు ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఉన్నాయని విద్యార్థులు ఎవరు ఈతకు వెళ్లడంగాని, సెల్ఫీలు దిగే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. ఇటీవల వెళ్లిన ఎందరో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనలో మొన్న ఐదుగురు యువకులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా అందరికి తెలిసిందేనన్నారు. ఐదుగురు యువకులు దుర్మరణంతో వారి తల్లిదండ్రులు పుట్టెడు శోఖంలో మునిగిపోయారని ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలోనే ఉద్యోగాలు చేసి తమ కుటుంబాలకు అండగా ఉంటారని ఆశతో ఉన్న తల్లిదండ్రులు కొండపోచమ్మ సాగర్ లో జరిగిన మొన్నటి ప్రమాదంలో కొడుకులను కోల్పోయి వారంతా జీవశ్శవాలుగా మారారని, మృతుల తల్లిదండ్రుల రోదన, మనోవేదన ఎవరు తీర్చలేనిదని ఎస్సై విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణానికి సృష్టిలో ఎంతో విలువ ఉందని, అలాంటి విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, పోయిన ప్రాణం తిరిగి పొందలేమని అన్నారు. రిజర్వాయర్ సందర్శనకు వెళ్లే సందర్శకులు పోలీసుల, ప్రభుత్వం వారి యొక్క సూచనలు తూచా తప్పకుండా పాటించాలని ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉందని, ప్రాజెక్టులో మొసల్లు సంచారం చేస్తున్నాయని ఎస్సై పేర్కొన్నారు. ఎస్సై విజయ్ కుమార్ తో పాటు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.