Site icon PRASHNA AYUDHAM

విద్యుత్ శాఖ ADE ఇంట్లో 2 కోట్ల నోట్ల కట్టలు.. హైదరాబాద్ మణికొండలో అవినీతి అనకొండ !

IMG 20250916 WA0063

విద్యుత్ శాఖ ADE ఇంట్లో 2 కోట్ల నోట్ల కట్టలు.. హైదరాబాద్ మణికొండలో అవినీతి అనకొండ !

హైదరాబాద్:తెలంగాణ విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం కాదు ఏకంగా అనకొండనే దొరికింది. మణికొండలో విద్యుత్ శాఖలో ADEగా (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్) పనిచేస్తున్న అంబేద్కర్ అక్రమంగా సంపాదించిన 2 కోట్ల నోట్ల కట్టలు ఏసీబీ సోదాల్లో దొరికాయి.

ఏసీబీ ఆ 2 కోట్ల నగదును సీజ్ చేసింది. విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అంబేద్కర్కు సంబంధించిన అక్రమాస్తులే లక్ష్యంగా ఏసీబీ సోదాలు చేసింది.

ఏసీబీ అధికారులు ఉదయం నుంచి 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ADE అంబేద్కర్పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏసీబీకి విద్యుత్ శాఖ అధికారులు తరుచూ పట్టుబడుతున్నారు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేద్కర్ నివాసం ఉంది. నానక్ రాంగూడలోని అంబేద్కర్ పర్సనల్ ఆఫీసులలోనూ ఏసీబీ సోదాలు జరిగాయి.

మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకు బంధువులను బినామీలుగా చేసి అంబేద్కర్ కోట్లు కూడబెట్టాడు. డబ్బు మాత్రమే కాదు అవినీతి సొమ్ముతో హైదరాబాద్ సిటీలో పలు చోట్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు కూడా ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పటికే అంబేద్కర్ అక్రమాస్తులకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ తనిఖీలు పూర్తయితే గానీ మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఎంత పెద్ద అవినీతి అనకొండనో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version