దీపావళి సందర్భంగా జాగ్రత్తలు తప్పనిసరి
ఫైర్ జిల్లా ఆఫీసర్ ఆర్. సుధాకర్
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి
పటాకులు కాల్చేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 17
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు అన్ని రకాల భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఆర్. సుధాకర్ సూచించారు. నిర్లక్ష్యం ప్రాణ, ఆస్తి నష్టాలకు దారి తీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అగ్నిభద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వివరాలకు వెళితే
పటాకులు ఇళ్ల మధ్య, రహదారులపై కాకుండా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి.
పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
పటాకులు కాల్చే ప్రదేశంలో నీటితో లేదా ఇసుకతో నింపిన బకెట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
సింథటిక్ లేదా నైలాన్ దుస్తులు ధరించకుండా, కాటన్ దుస్తులు ధరించాలి.
గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ ట్యాంకులు లేదా మంట పట్టే వస్తువుల దగ్గర పటాకులు కాల్చరాదు.
ప్రమాదం జరిగితే బాధితులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలి.
అదేవిధంగా, పటాకులు విక్రయించే వ్యాపారులు అగ్నిమాపక శాఖ జారీ చేసిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని, లైసెన్సు లేకుండా పటాకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్. సుధాకర్ హెచ్చరించారు.
దీపావళి పండుగను ఆనందంగా, కానీ సురక్షితంగా జరుపుకోవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.