Site icon PRASHNA AYUDHAM

నకిలీ లేబర్ కార్డులపై ఉద్యమానికి సిద్ధం!

IMG 20250921 WA0100

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 21, (ప్రశ్న ఆయుధం): 

భవన నిర్మాణ రంగంలో నిజమైన కార్మికుల హక్కుల రక్షణ కోసం ఎల్లారెడ్డి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఉద్యమానికి సిద్ధమైంది. నెలవారీ అమావాస్య సెలవు సందర్భంగా ఆదివారం సంఘం అధ్యక్షులు మహామేస్త్రి మార్లు సాయిబాబు ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చర్చించిన అంశాల్లో నకిలీ లేబర్ కార్డుల తొలగింపు అత్యవసరమని గుర్తించారు. అసలు కార్మికులు నష్టపోకుండా, నకిలీ కార్డులను నిర్మూలించేందుకు మండల వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మార్లు సాయిబాబు హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రతి నిజమైన కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు కలిగి ఉండాలి. నకిలీ కార్డులు నిజమైన కార్మికుల హక్కులను భంగం చేస్తున్నాయి”. నిజమైన కార్మికులు లేబర్ కార్డు పొందేందుకు రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, రెండు ఫోటోలు, ఈ–శ్రమ్ కార్డ్ నకలు కాపీలను తీసుకువచ్చి సంఘం కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, మండలంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయాలని, తొందరగా పూర్తి అయితే గృహ యజమానులు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి దుర్గాసింగ్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కాంతారావు, కార్యదర్శి గణేష్, ప్రచార కార్యదర్శి కరీం, సీనియర్ మాజీ అధ్యక్షులు అవిటి బాబు, మాజీ అధ్యక్షులు శ్యామ్, సలహాదారులు పోచయ్య, రామ్మోహనరావు, ప్రతాప్ రాజు, సత్యనారాయణ, గోపాల్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version