జిఎంఆర్ పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
– యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నాచారం శేఖర్
*గజ్వేల్ ప్రశ్న ఆయుధం ప్రతినిధి, జనవరి 04,
గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్న జిఎంఆర్ పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యుఎస్ఎఫ్ఐ గజ్వేల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నాచారం శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో మెస్ బిల్లులు కట్టలేక హస్టల్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గతంలో రెసిడెన్షియల్ హాస్టల్ గా ఉండేది, దానిని స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ గా మార్చి విద్యార్థులే హాస్టల్ నడుపుకోవాలి, ప్రతినెల బిల్లు కట్టుకోవాలి అని ప్రైవేటు హాస్టల్ మాదిరిగా జిఎంఆర్ పాలిటెక్నిక్ హాస్టల్ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్న హాస్టల్లో ఈ విధంగా మెస్ బిల్లులు కట్టుకోవడం అనేది వారికి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందని అన్నారు. విద్యార్థులు మేము మెస్ బిల్లులు కట్టలేక పోతున్నామని విన్నవించుకుంటే బిల్లు కట్టకపోతే హాస్టల్ కొనసాగదు, దాని కారణంగా హాస్టల్ మూసి వేయాల్సి వస్తుందని ప్రభుత్వం హాస్టల్ ఇన్చార్జిలపై ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేక హాస్టల్ ఇన్చార్జులు విద్యార్థులపై ఒత్తిడి తేవడం కొంతమంది విద్యార్థులు కళాశాలకు రావడం లేదని, కొంతమంది కట్టలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. దీని కారణంగా నిత్యవసర సరుకు నెలలు తరబడి బిల్లులు కట్టలేక హాస్టల్ ఇన్చార్జిలకు హాస్టల్ కొనసాగించడం కష్టంగా మారిందన్నారు. జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువు కునే విద్యార్థులు అందరూ నాన్ లోకల్ వారు కావడంతో హాస్టల్ లో తప్పనిసరిగా ఉండాల్సి వస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు అప్లికేషన్ చేసుకునేటప్పుడు జిఎంఆర్ పాలిటెక్నిక్ అని చూసే రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటుందనే నమ్మకంతో విద్యార్థులు వస్తే వారికి మెస్ బిల్లులు కట్టాలి అని చెప్పడంతో చాలామంది కట్టలేని స్థితిలో ఉండడం జరుగుతుందన్నారు. దీని కారణంగా హాస్టల్ మూసివేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈ హాస్టల్ని మళ్లీ రెసిడెన్షియల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ హాస్టల్ నుండి స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ గా మార్చింది, ప్రజా పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ నీ రెసిడెన్షియల్ హాస్టల్ గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ప్రవీణ్, రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు.