రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల బాధ్యత

విద్యార్థుల
Headlines
  1. రాజ్యాంగ పరిరక్షణ: విద్యార్థుల బాధ్యతపై ఎస్‌ఎఫ్‌ఐ సమ్మేళనం
  2. లౌకిక రాజ్యాంగానికి మద్దతు: మతానుబంధతకు వ్యతిరేకంగా నినాదం
  3. మతం మీద కాదు, మతోన్మాదంపై పోరాటం: వక్తల వ్యాఖ్యలు
  4. విద్యార్థి ఉద్యమాల నుంచి రాజ్యాంగ పరిరక్షణ బీజాలు
  5. భారత రాజ్యాంగం మతానికి వ్యతిరేకం కాదు, మతోన్మాదానికి వ్యతిరేకం

– భారత రాజ్యాంగం మతానికి కాదు.. మతోన్మాదానికే వ్యతిరేకం : ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో..

– వక్తలు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి వి.కృష్ణయ్య

– సమాజం పట్ల స్పందించే గుణాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కల్పిస్తోంది..

గాంధీజీ చెప్పినట్టు రాజ్యం, మతం ఒక్కటి కాదని, రాజ్యాంగ పరిరక్షణకు ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బీజాలు వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థి, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. భారత రాజ్యాంగం మతానికి కాదు.. మతోన్మాదానికే వ్యతిరేకమని తెలిపారు. సమాజం పట్ల స్పందించే గుణాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కల్పిస్తోందని తెలిపారు.

ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ ఏచూరి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ మహాసభ ఇచ్చిన ఓ నినాదం గుర్తుచేశారు. ‘ఎస్‌ఎఫ్‌ఐ స్టూడెంట్‌ ఈజ్‌ ఏ కంప్లీట్‌ స్టూడెంట్‌’ అని నమ్మితే మనం ఎక్కడున్నా ఎస్‌ఎఫ్‌ఐ విలువలతో నడుచుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. సమాజం పట్ల స్పందించటమనేది మనకు ఎస్‌ఎఫ్‌ఐ నేర్పిందన్నారు. 

మరో రెండు రోజుల్లో భారత రాజ్యాంగ స్వర్ణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఓ చారిత్రకతను సంతరించుకుందని తెలిపారు. ఖమ్మం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలుగునాట రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి బీజాలు వేయాలన్నారు. రాజ్యాంగ విలువలపైన ఎందుకు ఉద్యమం జరగకూడదని ప్రశ్నించారు. జస్టిస్‌ చిన్నపరెడ్డి ఒక తీర్పులో ”లౌకిక రాజ్యాంగం మతాతీత సమాజాన్ని కాదు.. మతాతీత రాజ్యాన్ని కోరుతుంది’ అని చెప్పారన్నారు. ‘స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం’ అనే నినాదాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన రోజు దాని లోతు తెలియకపోవచ్చు కానీ ప్రస్తుత సమాజంలో దాని ఆవశ్యకత ఏంటో బోధపడుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమ సమయంలో భారత రాజ్యంగంలోని మౌలిక విలువలు.. మతం, లౌకికతత్వంపై ఘర్షణ పడ్డామని, ఇప్పుడు ఆ ఘర్షణ విశ్వరూపం చూస్తున్నామని తెలిపారు. 

మత విశ్వాసాలున్న వారిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, కానీ మతం ఆధారంగా రాజకీయ సమీకరణాలు, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని, మతాన్ని జాతీయతతో ముడిపెట్టే ఆలోచనలను వ్యతిరేకించాలని స్పష్టంచేశారు. మన పోరాటం మతంపైన కాదు.. మత ఉన్మాదం పైన అని అన్నారు. రాష్ట్రాల రాజకీయ ఉనికిపైన, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపైన, భారతీయత భావనపైన దాడి జరుగుతోందన్నారు. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నారు. గౌతమ్‌ అదానీ గంటకు రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని, కానీ దేశంలో కటిక పేదరికంలో మగ్గేవారు అనేక మంది ఉన్నారని తెలిపారు. మతాన్ని విద్వేషంగా వాడుతున్న వారితో ఏ రకంగా ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమంలో పోరాడామో.. ఇప్పుడు కూడా ఆ మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక అంకురార్పణ కావాలని పిలుపునిచ్చారు.

1500 మంది హాజరు..

ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 1500 మంది వరకు పూర్వవిద్యార్ధులు హాజరయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల్లో ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, జెడ్పీ మాజీ చైర్మెన్‌ లింగాల కమలరాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర తదితరులు ప్రసంగించారు. ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థులు ఆలపించిన గేయాలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా భారతీయతకు భాష్యం, సీతారాంఏచూరి, జనవిజ్ఞాన వేదిక జీవ పరిణామం తదితర పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. దీనికి ముందు ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి మాటూరి రామచంద్రరావు సహా అశువులు బాసిన ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థులకు సంతాపం తెలుపుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి ఏజే రమేష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి ముందు ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని సీనియర్‌ పూర్వ విద్యార్థి కొండపల్లి పావన్‌ ఆవిష్కరించగా.. మరో విద్యార్థి వీవీ లక్ష్మీనారాయణ రాజ్యాంగ ప్రవేశిక పఠనం ప్రతిజ్ఞ చేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల వేదిక కన్వీనర్‌ ఎం.సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ ఆత్మీయ సమ్మేళనం కన్వీనర్‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విప్లవ్‌కుమార్‌, కళ్యాణం వెంకటేశ్వర్లు, అనురాధ అధ్యక్షవర్గం గా ఈ ఆత్మీయ సమ్మేళనం కొనసాగింది.

భారతదేశం కార్పొరేట్ల రాజ్యమైంది.. : వి.కృష్ణయ్య

మోడీ అధికారంలోకి వచ్చాక భారతదేశం కార్పొరేట్ల రాజ్యంగా మారిందని ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అంటే ఆకాశం ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తున ఆలోచించమనే భావోద్వేగం, అధ్యయనం పోరాటం నినాదం.. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పిన సిద్ధాంతం అన్నారు. ‘స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం’ మూడు లక్ష్యాలు ఢిల్లీలో మోడీ వచ్చాక ప్రమాదంలో పడ్డాయని తెలిపారు.

భారతరాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో మనందరికీ సీతారాం ఏచూరి విప్పిచెప్పారన్నారు. మోడీ పదేండ్లలో 252 చట్టాలు చేశారని, వీటి ద్వారా దేశంలో మన జీడీపీలో 50శాతం కార్పొరేట్‌ కంపెనీల వాటా అయిందన్నారు. రైతుల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులన్నింటిపై కార్పొరేట్‌ కంపెనీల పెత్తనమేనని తెలిపారు. ప్రజల చేతుల్లో ఉండాల్సిన స్వాతంత్య్రం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందని ప్రశ్నించారు. భారత స్టాక్‌ మార్కెట్లోని 1500 కంపెనీల్లో 50 శాతం కార్పొరేట్‌ వాటా ఉందని అన్నారు. 

ప్రజలందరీ స్వాతంత్య్రం కార్పొరేట్‌ స్వాతంత్రంగా మారుతోందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సిన పార్లమెంట్‌.. మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాల ప్రకారం జరుగుతున్నదని అన్నారు. రాష్ట్రాల హక్కులను కూడా హరించి వేస్తున్నారని, చివరకు పంట కాల్వల్లో పారే నీరు కూడా వారి నియంత్రణలో ఉంటోందని ఆరోపించారు. దేశంలోని 11 కోట్ల హెక్టార్ల భూములను రెండేండ్లలో డిజిటలైజ్‌ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. రాజ్యాంగమైనా ఉంటుందా.. అంటే ఉండకూడదూ అని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయించుకున్నాయన్నారు. పెట్టుబడిదారీ మార్కెట్‌ కోసం ప్రపంచాన్ని అణుయుద్ధం వైపు పయనింపజేస్తున్నారని తెలిపారు. సోషలిజం వైపుగా ఈ ప్రపంచాన్ని నడిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వామపక్షాలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలు అవినీతి చేస్తే తప్ప నడవలేని పరిస్థితి ఉందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment