రాచకొండ పోలీసుల ‘ఆపరేషన్ ముస్కాన్-XI’ విజయవంతం

రాచకొండ పోలీసుల ‘ఆపరేషన్ ముస్కాన్-XI’ విజయవంతం

2,479 బాల కార్మికులు రక్షణ – 530 కేసులు నమోదు, 556 అరెస్టులు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 2

బాల కార్మికులను గుర్తించి, రక్షించేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ఆపరేషన్ ముస్కాన్-XI’ విజయవంతంగా ముగిసింది. ఒక నెల రోజుల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 2,479 మంది పిల్లలు రక్షించబడ్డారు. వీరిలో 2,353 మంది బాలురు, 126 మంది బాలికలు ఉన్నారు.

ఈ ఆపరేషన్‌లో 530 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 556 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాజమానుల నిర్లక్ష్యం వల్ల నేరపూరితంగా బాల కార్మికులను నియమించిన వారిపై బాల కార్మిక చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన 9 ప్రత్యేక డివిజనల్ బృందాలు, బస్-రైల్వే స్టేషన్లు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, కార్ వాష్ సెంటర్లు, గ్లాస్ వర్క్ షాపులు, పౌల్ట్రీ ఫార్ములు వంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి.

రక్షించబడిన పిల్లల్లో 109 మంది 14 సంవత్సరాల లోపు, మిగిలిన 2,370 మంది 14 ఏళ్లు పైబడినవారు.

రక్షించబడిన పిల్లల్లో 1,077 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 1,390 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వారిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పిల్లలు ఉన్నారు. 12 మంది నేపాల్కు చెందినవారుగా గుర్తించారు.

ఈ పిల్లల కోసం విద్యా శాఖ సహకారంతో ప్రాథమిక విద్య, వృత్తి శిక్షణా కోర్సుల్లో చేర్పించారు. ఈ కార్యక్రమం రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు మరియు మహిళా భద్రతా డీసీపీ టి. ఉషారాణి పర్యవేక్షణలో నిర్వహించబడింది.

ఆపరేషన్‌లో ఏహెచ్‌టీయూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, చైల్డ్‌లైన్, పలు ఎన్‌జీఓలు భాగస్వాములయ్యారు.

పోలీసులు మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ ఒక నేరం అని, ఎవరైనా పిల్లలను పని చేయిస్తున్నట్టు సమాచారం ఉంటే 100, 112, లేదా 1098 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment