ఆపరేషన్ సిందూర్ అంశంలో జైశంకర్‌పై రాహుల్ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ

ఆపరేషన్ సిందూర్ అంశంలో జైశంకర్‌పై రాహుల్ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ

ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ ఆరోపణల ఖండన

దాడికి ముందే పాక్‌కు సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ

జైశంకర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందన్న కేంద్రం

రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమన్న బీజేపీ, పీఐబీ

ఆపరేషన్ మొదలయ్యాకే సమాచారం ఇచ్చామని వివరణ

‘ఆపరేషన్ సిందూర్‌’ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలకు సమాచారం అందించారని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన తొలి దశలోనే, అంటే ఆపరేషన్ మొదలైన తర్వాత, పాకిస్థాన్‌తో పాటు ఇతర సంబంధిత దేశాలకు సమాచారం అందించినట్లు కేంద్రమంత్రి జైశంకర్ తెలిపారని విదేశాంగ శాఖ వివరించింది. అయితే, దాడికి ముందే ఈ సమాచారం బయటకు వెళ్లిందని, దీనివల్ల పాకిస్థాన్ అప్రమత్తమైందని కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆరోపించడం పూర్తిగా నిరాధారమని పేర్కొంది. జైశంకర్‌పై రాహుల్ గాంధీ చేస్తున్నవి అసత్య ఆరోపణలని తెలిపింది.

బీజేపీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది. ఆపరేషన్ సిందూర్‌పై బ్రీఫింగ్ ఇస్తూ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చేసిన ప్రకటనను బీజేపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఆపరేషన్‌ ప్రారంభించిన వెంటనే తాము ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నట్లు పాక్‌కు చెప్పడానికి ప్రయత్నించగా, భవిష్యత్తులో ఆ దాడులకు తాము తీవ్ర సమాధానం ఇస్తామని దాయాది దేశం హెచ్చరించినట్లు లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నారని బీజేపీ తెలిపింది. కేంద్రమంత్రి జైశంకర్ విదేశాల్లో ఉన్న సమయంలో ఆయనపై కాంగ్రెస్ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ మండిపడింది.

మరోవైపు, పీఐబీ సైతం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. కేంద్రమంత్రి జైశంకర్ ఆపరేషన్‌కు ముందు సమాచారం ఇచ్చినట్లు ఎక్కడా ప్రకటన చేయలేదని తన ఫ్యాక్ట్‌చెక్‌లో స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభానికి ముందే ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై దాడి చేస్తున్నామని, పాకిస్థాన్ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్ చెప్పినట్లు జైశంకర్ పేర్కొన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల పాకిస్థాన్ ముందుగానే అప్రమత్తమయ్యిందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఖండించింది.

Join WhatsApp

Join Now