*రాహుల్ లేఖ.. రేవంత్ స్పందన ఇదీ*
*హైదరాబాద్, ఏప్రిల్ 22*
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ స్పందించారు. రాహుల్ ప్రేరణ రేకెత్తించే ఆలోచన తనని కదిలించిందని ట్విట్టర్ ద్వారా సీఎం తెలిపారు. రాహుల్ లెటర్‌ను చారిత్రక నగరం హిరోషిమాలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు చదివినట్లు వెల్లడించారు. రాహుల్ ప్రేరణ కలిగించే ఆలోచనలకు అనుగుణంగా, గర్వించదగ్గ భవిష్యత్‌ను నెలకొల్పడం కోసం ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నిన్న(సోమవారం) సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తార్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు అర్ధాంతరంగా జీవితాలు ముగించారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డికి సూచించారు.
కాగా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల మరణం తర్వాత రోహిత వేముల చట్టం తీసుకురావాలని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఈ అంశంపై దేశం వ్యాప్తంగా చర్చ జరిగింది. తాము అధికారంలోకి వస్తే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని, ఈ చట్టం ద్వారా యూనివర్సిటీల్లో, విద్యాసంస్థల్లో జరుగుతున్న కుల వివక్షతను ఆపవచ్చని, అరికట్టవచ్చని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. తాజాగా రెండు రోజు క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో రోహిత్ వేముల చట్టమే రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. అలాగే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా రాహుల్ లేఖ రాశారు. ఆ లేఖలో రోహిత్ వేముల చట్టం అవసరం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది రావాల్సిన ఆవశ్యకత ఏంటి అనే అంశాలను సీఎం రేవంత్‌కు స్ఫష్టం చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖపై ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ స్పందించారు.
ఆ లేఖను ట్విట్టర్ అకౌంట్‌లో పెడుతూ.. దానికి సమాధానంగా కొన్ని అంశాలను, కొన్ని వ్యాఖ్యలను రాసుకొచ్చారు. రేవంత్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. జపాన్‌లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఒక చారిత్రాత్మక నగరంలో ఉన్న రేవంత్.. అక్కడ ఉన్న గాంధీజీ విగ్రహాన్ని సందర్శించి.. అక్కడ ఈ లేఖను చదివినట్లు ఆయన పేర్కొన్నారు. రాహుల్ ఏం ఆలోచించినా.. దేశం కోసం, దేశ ప్రజల కోసమే అని సోషల్ జస్టిస్ కోణంలోనే ఆలోచిస్తారని తెలిపారు. ఈ ఆలోచన, లేఖలో పేర్కొన్న అంశాలను తనను ఎంతగానే ప్రేరణ కలిగించాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ చట్టంపై చర్చ జరిగి దాన్ని అమలు చేసే అవకాశం ఉంది. రోహిత్ వేముల చట్టం తీసుకురావడం వల్ల యూనివర్సిటీల్లో జరుగుతున్న కులవివక్షతను ఆపే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తే భవిష్యత్‌లో మిగితా రాష్ట్రాల్లో కూడా తీసుకురావచ్చు అని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.