బండి సంజయ్ వార్నింగ్ ఎఫెక్ట్తో కదిలిన రైల్వే కాంట్రాక్టర్
ఉప్పల్ ఆర్వోబీపై గడ్డర్లు బిగించిన రైల్వే అధికారులు
*చెన్నై నుంచి తీసుకొచ్చిన భారీ క్రేన్లతో పూర్తయిన కీలక ఘట్టం…
ఆగస్టులోపు ఉప్పల్ ఆర్వోబీ పనులు పూర్తి చేస్తామని రైల్వే శాఖ
హుజురాబాద్ జూలై 27 ప్రశ్న ఆయుధం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ పనులకు మోక్షం కలిగింది. ఆర్వోబీ పనుల్లో కీలక ఘట్టమైన గడ్డర్ల బిగింపు పనులను రైల్వే శాఖ అధికారులు ఆదివారం రోజున పూర్తి చేశారు. ఉప్పల్ ఆర్వోబీ పనుల్లో గడ్డర్లు బిగింపు పనులే అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ గడ్డర్లు బిగించాలంటే ఆ రైల్వే లేన్ పై వెళ్లే రైళ్ల రాకపోకలను 3 నుండి 6 గంటల పాటు నిలిపివేయాల్సి ఉంది. దీంతోపాటు ఈ గడ్డర్లకు బిగింపుకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేదు. చెన్నై నుండి ఇప్పించి పనులు సాగించారు ఉప్పల్ ఆర్వోబీ పనులు గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయని
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల రైల్వే శాఖ అధికారులను పిలిపించుకుని ఉప్పల్ ఆర్వోబీ పనుల అంశంపై చర్చించారు. దశాబ్దకాలంగా ఉప్పల్ ఆర్వోబీ పనులు సాగడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు మారినా, సీబీఐ విచారణ జరిగినా… ఇంతవరకు ఆ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు? అసలు సమస్య ఏమిటి? అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉప్పల్ ఆర్వోబీ పనులను పూర్తి చేస్తామని ఒకసారి, పార్లమెంట్ ఎన్నికల తరువాత పూర్తి చేసి ప్రారంభిస్తామని మరొకసారి రైల్వే శాఖ అధికారులు చెప్పారు. అదే విషయంపై ప్రజలకు హామీ ఇచ్చాను. అయినా ఇంతవరకు ఆ పనులే పూర్తి కాలేదు. అసలు సమస్య ఏమిటి? నెల రోజుల్లో ఉప్పల్ ఆర్వోబీ పనులను పూర్తి చేయకపోతే వచ్చే నెలలతో తానే దగ్గరుండి ఆర్వోబీని కూల్చివేయిస్తా. ఏం తమాషా చేస్తున్నారా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టింపు లేనట్లు వ్యవహారిస్తారా?’’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై బండి సంజయ్ పలుమార్లు బహిరంగంగానే మాట్లాడారు.ఈ నేపథ్యంలో దిగొచ్చిన రైల్వే శాఖ అధికారులు ఉప్పల్ ఆర్వోబీ పనుల్లో గడ్డర్ల బిగింపు అత్యంత కీలకఘట్టమని చెప్పాను. రైల్వేలను 3 గంటలపాటు నిలిపివేసి ఆ రైల్వే లేన్ పై గడ్డర్లను బిగించాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేదని చెన్నై నుండి తెప్పించాల్సి ఉందని తెలిపారు. వెంటనే రైల్వే జీఎం, ఏజీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి తక్షణమే చెన్నైయ్ నుండి క్రేన్ తెప్పించి రైళ్లను ఆపి యుద్ద ప్రాతిపదికన గడ్డర్లను బిగించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రైల్వే అధికారులు ఆదివారం ఉదయం చెన్నై నుండి క్రేన్ తెప్పించారు. దాదాపు మూడున్నర గంటలపాటు జమ్మికుంట ఉప్పల్ వైపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. చెన్నై నుండి తెప్పించిన క్రేన్ తోపాటు అందుబాటులో ఉన్న మరో క్రేన్ సాయంతో గడ్డర్లను బిగింపు పనులు ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసినందున మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరులోపు ఆర్వోబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.