Site icon PRASHNA AYUDHAM

మధ్యతరగతి వర్గాల కోసం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు – తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ప్రకటన

IMG 20250723 WA0050

*మధ్యతరగతి వర్గాల కోసం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు – తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ప్రకటన*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 23

రాజీవ్ స్వగృహ పథకం ద్వారా నిర్మించిన ఫ్లాట్లు దిగువ, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా, వేలం ప్రక్రియ లేకుండానే నిర్ణీత ధరకు విక్రయిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి మరియు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

బుధవారం ఆయన పోచారం, నాగోలు, బండ్లగూడ ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పోచారంలో మీడియాతో మాట్లాడుతూ, “రూ. 13 లక్షల నుంచి 16 లక్షల మధ్య సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు, రూ. 19 లక్షల నుంచి 22 లక్షల మధ్య డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు బహిరంగ మార్కెట్‌లో ఎక్కడా లభించవు. లాభాపేక్ష లేకుండా, వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా ధరను నిర్ణయించాం,” అని వివరించారు.ప్రస్తుతం పోచారం సద్భావనా టౌన్‌షిప్‌లో 255 సింగిల్ బెడ్‌రూమ్, 340 డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని లాటరీ ప్రక్రియ లేకుండా, కొనుగోలుదారులు తాము కోరుకున్న ఫ్లాట్‌ను నేరుగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. రుణ సదుపాయాల కోసం టౌన్‌షిప్‌లోనే బ్యాంక్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని గౌతమ్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు సి. భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని గౌతమ్ పిలుపునిచ్చారు.

Exit mobile version