ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు వీరికే ?రాజీనామాలు చేసిన వారెవరికీ చాన్స్ లేనట్లే ?
గల్లా జయదేవ్.
తెలుగుదేశంపార్టీ తరపన గుంటూరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ వైసీపీ ప్రభుత్వం, జగన్ వేధింపుల కారణంగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కంపెనీని కూడా తెలంగాణలో విస్తరిస్తున్నారు. అయితే టీడీపీకి మాత్రం గట్టి సపోర్టుగానే ఉంటున్నారు. గల్లా కుటుంబానిక రాజకీయం ఉన్న చరిత్ర దృష్ట్యా సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనకు ఓ రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేస్తారని భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజు
టీడీపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అశోక్ గజపతిరాజు. మాజీ రాష్ట్ర మంత్రిగా.. కేంద్ర మాజీ మంత్రిగా పని చేశారు. విజయనగరం జిల్లా టీడీపీకి ఆయన పెద్ద దిక్కు. అయితే వయసు కారణం, అనారోగ్యాలతో అంత యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన సీనియారిటీని గుర్తించేలా చంద్రబాబు రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
జనసేన నుంచి నాగబాబు…
మూడో స్థానాన్ని జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా తెలుస్తోంది జనసేన తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు పేరు ఖరారయిందని అంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూటమి సర్దుబాట్లలో భాగంగా ఆ స్థానం బీజేపీకి పోవడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఆయనను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే అధికారిక ప్రకటన
అయితే ఈ మూడు రాజ్యసభ పదవులు పూర్తి పదవికాలం ఉన్నవి కావు. రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పదవి కాలం ఉన్నవి మాత్రమే. అయితే మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూటమికే ఆ సీట్లు వస్తాయి కాబట్టి వారిని కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే అభ్యర్థుల పేర్లను ఇప్పుడే అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు…