అవినీతిపరులకు బీజేపీలో చోటులేదు: కవిత చేరికపై రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
కవితను పార్టీలో చేర్చుకునేది లేదన్న తెలంగాణ బీజేపీ చీఫ్
కవిత సస్పెన్షన్‌తో బీఆర్ఎస్ పనైపోయిందని వ్యాఖ్య
కాళేశ్వరం కేసును కాంగ్రెస్ నీరుగార్చిందని విమర్శ
వాటాల పంపకాల గొడవలే కవిత సస్పెన్షన్‌కు కారణమని ఆరోపణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, త్వరలోనే ఆ పార్టీలోని ఇతర నేతలు కూడా కారు దిగిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
నిన్న నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో రాంచందర్‌రావు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని, వారి కుటుంబ పంచాయితీ ఇప్పుడు రోడ్డున పడిందని ఆరోపించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో జరిగిన అవినీతి బట్టబయలైందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపైనా రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను 20 నెలలుగా ఆలస్యం చేస్తోందని, దీనివల్ల నిందితులు ఆధారాలు తారుమారు చేసేందుకు అవకాశం దొరికిందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసును ముందుగానే సీబీఐకి అప్పగించి ఉంటే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని అభిప్రాయపడ్డారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ‘తెలంగాణ పరిపాలన దినోత్సవం’ అంటూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. నిజాం వారసులైన ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ అంటకాగుతున్నాయని దుయ్యబట్టారు. ఇదే సమయంలో, కాళేశ్వరం కుంభకోణంలో హరీశ్‌రావు, సంతోష్ పాత్ర ఉందని ఆరోపించిన కవిత, తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు సూచించారు.