అర్హులందరికీ రేషన్ కార్డులు తప్పనిసరిగా అందిస్తాం – మంత్రి శ్రీధర్ బాబు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 5
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు తప్పనిసరిగా అందజేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మరియు మేడ్చల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.మేడ్చల్ నియోజకవర్గంలోని అత్వెల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరిలతో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా రేషన్ కార్డులు రాని వారు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని, అందులో భాగంగా 3.75 లక్షల లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామని, ఇందుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, దీని వల్ల వారికి ఆర్థిక లాభం కలుగుతోందని తెలిపారు. ప్రతి జిల్లాలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, గోదావరి జలాల తరలింపుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పారదర్శకంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
సన్నబియ్యం సరఫరా
రేషన్ కార్డుదారుల ప్రతి ఒక్కరికి సుమారు 6 కేజీల చొప్పున సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. పంపిణీ చేసిన రేషన్ కార్డులతో పాటు ఆరోగ్య శ్రీ కార్డు కూడా అమలులో ఉంటుందని వివరించారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కార్యక్రమంలో కోటి రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ మను చౌదరి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.