31 రైతు ఆత్మహత్యలను అర్థంచేసుకోలేని ఆర్బిఐ గవర్నర్
డిసెంబర్27వ తేదీన ఉదయ్పూర్లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు యుపిఏ ప్రభుత్వం ప్రకటించిన రైతు ఋణ మాఫీ ఔచిత్యాన్ని ప్రశ్నించాడు. అలాచేయటంతో వాస్తవంలో వ్యవసాయ రంగానికి అందవలసిన పరపతి దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నాడు. వ్యవసాయదారులకు ఇచ్చే ఋణ మాఫీ ఔచిత్యాన్ని ప్రశ్నించిన వారిలో డాక్టర్ రాజన్ మొదటివాడు కాదు. చాలా మంది ముఖ్యంగా నయా ఉదారవాద అర్థశాస్త్రవేత్తలు గతంలో ఇదేపని చేశారు. ఈ పథకం వల్ల అనేక మంది అనర్హులు లబ్దిపొందారని, అనేక మంది అర్హులకు ఈ సదుపాయం అందలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిన పరిశీలనను తమ వాదనకు మద్దతుగా వాడుకున్నాడు.
ఈ వాస్తవం మాత్రమే ఆ పథకం ఆవశ్యకతను నిర్దేశింపజాలదు. బోగస్ రేషన్ కార్డులున్నాయని నిత్యావసర వస్తువుల పంపిణీని, ఎవరో కొందరు మధ్య దళారులు నిధులను స్వాహా చేస్తున్నారని ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేయాలని వాదించటం ఎంత మూర్ఖత్వమవుతుందో అనర్హులైన లబ్దిదారులున్నారనే విషయంపై ఆధారపడి ఋణమాఫీని వ్యతిరేకించినా అంతే మూర్ఖత్వమవుతుంది. ఒక పథకాన్ని సరిగా అమలుచేయటంలేదనే వాస్తవం ఆ పథకాన్ని రద్దు చేయటానికి గాని లేక దాని ఔచిత్యాన్ని ప్రశ్నించటానికిగాని వాదన కాజాలదు. అది కేవలం ఆ పథకం అమలును మెరుగుపర్చటానికి మాత్రమే వాదనగా ఉంటుంది. అలాంటి పథకాలను పరిమార్చటానికి నయా ఉదారవాద మూకకు ఏ కర్ర అయినా ఒకటే. ఒక వేళ ‘అపరిపక్వ పాలన’ అనేది ఉంటే దానినే వారు ఆ కర్రగా వాడతారు.
అయితే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ వాదన ఈ విషయాన్ని తడమలేదు. దానికి బదులుగా ఆయన రెండు వేరువేరు వాదనలను లేవనెత్తాడు: మొదటిది, రైతులు
బ్యాంకుల నుంచే కాకుండా ఇతర మార్గాలలో అప్పులు తీసుకుంటారు. బ్యాంకులనుంచి తీసుకునే అప్పు దీర్ఘకాలిక ఋణంగా కాక చాలా వరకు పంట ఋణంగా ఉంటుంది. అంటే రైతుల ఋణ భారంలో బ్యాంకుల పాత్ర పరిమితమైనందున దానికి అనుగుణంగా వారి ‘దుస్థితిని మెరుగుపరిచేందుకు చేసే ఋణ మాఫీ కూడా పరిమితంగాను, పాక్షికంగాను ఉంటుంది. రైతు ఆత్మహత్యలకు ఋణ భారం ఎంతవరకు కారణమనే విషయం గురించి స్పష్టతలేనందున బ్యాంకులపై ప్రభుత్వం రుద్దే ఋణ మాఫీ పథకం మొత్తంమీద ప్రశ్నార్థకమైన కరణీయతగల(క్వశ్చనబుల్ రేషనేల్) తొందరపాటు ప్రతిస్పందనగా ఉంటుంది. వ్యవసాయానికి పరపతి సౌకర్యం ఋణమాఫీ పథకంవల్ల దెబ్బతిన్నదనే రెండవ విషయాన్ని దీనికి జోడించినప్పుడు ఆ పథకం సరియైనదికాదని, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలియకుండా ప్రతిస్పందించటం వల్ల ప్రతికూల పర్యవసానాలుంటాయని దాని భావం.
* రైతుల ఆత్మహత్యలకు, వారి ఋణభారానికి మధ్యగల సంబంధం
డాక్టర్ రాజన్ వాదనలను వరుసగా పరిశీలిద్దాం. ఆయన నమ్మకానికి భిన్నంగా రైతుల ఆత్మహత్యలకు, వారి ఋణ భారానికి మధ్య సంబంధం ఉన్నదనే విషయంలో ఏమాత్రం సందేహంలేదు. కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఆత్మహత్యలు జరిగిన ప్రదేశాలను సందర్శించిన జర్నలిస్టుల నివేదికలేకాకుండా అనేక అధ్యయనాలు ఈ వాస్తవాన్ని దృవీకరించాయి. నిజానికి నిస్పృహకు లోనయిన రైతులపట్ల సానుభూతిలేని క్రూర స్వభావంగల కొందరు ఈ ఆత్మహత్యలు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసమే జరుగుతున్నాయని ప్రకటిస్తారు. దానర్థం డబ్బు సంబంధిత విషయాల వల్లే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని నర్మగర్భంగా అంగీకరించటమే. రైతులకు పెద్ద మొత్తంలో ఉండే ఋణాలు మాఫీ అయితే వారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇది ఆత్మహత్యలను ఆపే సాధనమవుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే రైతు ఆత్మహత్యలను ఆపే సాధనంగా ప్రభుత్వం ఋణ మాఫీ చేయటం సరిఅయినదే.
అయితే బ్యాంకు పరపతి ప్రధానంగా పంట ఋణాలకేనని, బ్యాంకుల ఋణ మాఫీ వల్ల పరిమిత ప్రభావమే ఉంటుందనే డాక్టర్ రాజన్ వాదనను పరిశీలిద్దాం. రైతాంగం ఆర్థిక పరిస్థితి ఏకీకృతంగా ఉంటుందనే అంశాన్ని ఈ వాదన విస్మరిస్తున్నది. వినియోగానికి సంబంధించిన అప్పును మాఫీ చేసినా రైతు చేస్తున్న వ్యవసాయోత్పత్తిలో ఎంతోకొంత వెసులుబాటు ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ విషయం అప్పు దేనికోసం తీసుకున్నారనికాదు, ఎందుకోసం తీసుకున్నా దాని మాఫీ రైతు ఆర్థిక పరిస్థితిని ఎంతోకొంత మెరుగుపరుస్తుంది. రైతులను నిసృహలోకి జారిపోకుండా చేసి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనరాకుండా చేస్తుంది.
వివిధ వనరులనుంచి రైతులు తీసుకుంటున్న అప్పుల స్థాయి గురించి నమ్మదగిన సమాచారం డాక్టర్ రాజన్కి కూడా అందుబాటులో లేనప్పటికీ నైరాశ్యంలో ఉన్న రైతులను ఆదుకుని, వారి స్థితిని మెరుగుపర్చటం ప్రభుత్వం బాధ్యత కాదని వాదించటం సరియైన పనికాదు. కరువుకాలంలో భూమి శిస్తును మధ్యయుగంలోని ప్రభుత్వాలు తగ్గించేవి. స్వాతంత్ర్యానికి ముందు అవిభక్త పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కరువుకాటకాల వల్ల, బ్యాంకులు కాక ప్రయివేటు వడ్డీ వ్యాపారులకు అప్పులు చెల్లించాల్సిన రైతులను పరిహారం చెల్లించి ఆదుకునేవి. వలస పాలనలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పనిని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలకు కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం చేయలేకపోతే ఆశ్చర్యపోవాల్సివచ్చేది.
ఋణ మాఫీ వల్ల వ్యవసాయానికి పరపతి తగ్గిపోయిందనే వాదనను పరిశీలిద్దాం. ఇలా ఎందుకు జరిగిందనేది ఓ మర్మం. దానికిగల కారణాలను డాక్టర్ రాజన్ వివరించలేదు. అయితే వ్యవసాయానికి అందాల్సిన పరపతి నిజంగా కుచించుకుపోయింది. ఇలా జరగటాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్డుకోవాల్సింది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించకపోతే అవి తిరిగి అప్పు ఇవ్వవు. అయితే ఋణ మాఫీకి దీనికి సంబంధం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే తీర్చని అప్పు తీసుకున్నవారి పేరు బుక్స్లో నమోదై ఉన్నదా లేక అది మాఫీ అయినదా అనే వాటిలో ఏది నిజమైనా తాజాగా బ్యాంకులు అప్పు ఇవ్వగలిగే సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే వాటిలో ఏదినిజమైనా బ్యాంకుల వద్ద అప్పు ఇవ్వటానికి వనరులు లేవు. అయితే మరోవైపు ప్రభుత్వమే ఋణ మాఫీ చేసేందుకు సిద్దపడినప్పుడు నిస్పృహలో ఉన్న రైతాంగం ఆ ఋణాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఏర్పడిన వనరుల కొరతను తీర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. దానితో తాజాగా అప్పులిచ్చే సామర్థ్యం బ్యాంకులకు పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఋణ మాఫీ పర్యవసానంగా వ్యవసాయానికి కేటాయించే పరపతి తగ్గే బదులుగా నియమానుసారంగా పెరగాలి.
అయితే రిజర్వ్ బ్యాంకు గవర్నరే ఇది జరగటంలేదని చెబుతున్నాడంటే ఋణ మాఫీ పథకాన్ని అమలుచేయటంలో తప్పకుండా ఏదో లోపం ఉండిఉంటుంది. దానిని గురించి ఆయన ఏమీ ప్రస్తావించలేదు. లేక ఋణ మాఫీ వల్ల ‘అప్పు ఎగ్గొట్టే’ అలవాటు అవుతుందని భయపడి రైతులకు తిరిగి అప్పులివ్వటానికి బ్యాంకులు సంశయిస్తుండవచ్చు. మొదటిదే నిజమైతే దానికి ఋణ మాఫీ పథకాన్ని నిందించలేము. కానీ రెండవది నిజమైనప్పుడు బ్యాంకులు తమ సామాజిక బ్యాంకింగ్ కర్తవ్యాలను సరిగా నిర్వర్తించటం లేదనే వాస్తవం ముందుకొస్తుంది. బ్యాంకులు ప్రజల యాజమాన్యంలో ఉండటం అంటేనే ఈ కర్తవ్యాలు వాటికి ఆదేశాలుగా ఉంటాయి.
ఈ కర్తవ్యాలను బ్యాంకులు విస్మరించినప్పుడు రిజర్వ్ బ్యాంకు వాటిని సరియైన మార్గంలో నడిచేలా అజమాయిషీ చేయవలసి ఉంటుంది.
*సామాజిక కర్తవ్యాలను విస్మరిస్తున్న బ్యాంకులు
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ(జాతీయ బ్యాంకులతో సహా) తన సామాజిక కర్తవ్యాలను వ్యవస్థీకృతంగా విస్మరిస్తూఉన్నది. ప్రాథమ్య రంగానికి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన నియమాలనన్నింటినీ నిరంతరం ఉల్లంఘిస్తున్నది. ఈ విషయంలో విదేశీ యాజమాన్యంలోగల బ్యాంకులు, ఆ తరువాత భారతీయుల యాజమాన్యంలోని ప్రయివేటు బ్యాంకులు మరీ ధారుణంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ బ్యాంకులకు కూడా ఈ జాడ్యం సోకింది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ స్పందన బ్యాంకుల ఆచరణను సరిదిద్దేదిగా కాకుండా వ్యవసాయ రంగం కోసం కేటాయించే పరపతి నిర్వచనాన్ని నీరుగార్చటంగా ఉన్నది. దీనితో వాస్తవంగా రైతులకు అప్పు ఇవ్వకుండానే వ్యవసాయ రంగానికి ఇవ్వవలసిన పరపతిని ఇచ్చినట్లు అవుతుంది.
ఈ పరిస్థితి ఎందాకా వచ్చిందంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రవర్తనం(ప్రోసెసింగ్)చేసే బహుళ జాతి కంపెనీలకు ఇచ్చే ఋణాలు కూడా ‘వ్యవసాయ రంగ ఖాతా’లో పడుతున్నాయి. అలా ఇచ్చిన అప్పుల్ని ప్రాథమ్య రంగ నియమాలను అనుసరించి ఇస్తునట్లుగా చూపిస్తున్నారు. ఐసిఐసిఐ లాంటి అనేక బ్యాంకులు తాము రైతులకు వ్యక్తిగతంగా అప్పులివ్వలేమని బహిరంగంగా ప్రకటిస్తున్నాయి. ఒకవేళ రైతులకు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే దాన్ని ‘మధ్యవర్తుల’ ద్వారా ఇస్తున్నారు. ఈ ‘మధ్యవర్తులు’ గతకాలపు వడ్డీ వ్యాపారుల మాదిరిగానే ఉంటారు. ఉన్న తేడా ఏమంటే వడ్డీలు గుంజే వారి కార్యకలాపాలు బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ముతో కొనసాగుతుంటాయి.
‘నయా ఉదారవాద శకం’లో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఈ నేరంలో భాగస్వాములుగా ఉన్నాయి. పనికిమాలిన ‘వ్యవస్థాపన’ ప్రోజెక్టుల కోసం పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు బ్యాంకులు ఇచ్చిన లక్షలాది కోట్ల ఋణాలు బ్యాంకింగ్ వ్యవస్థను బలహీన పర్చాయని చెప్పకుండా యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన రైతు ఋణ మాఫీ దానికి కారణమని డాక్టర్ రాజన్ తన ఉపన్యాసంలో పేర్కొనటం ప్రాధాన్యత కలిగిన విషయం. వ్యవసాయిక ఋణాల గురించి ఆయన తన విమర్శను ఆచితూచి చేశాడనేది నిజం. అయితే ముసుగేసినా అది విమర్శ అన్నది స్పష్టం. అయితే నయా ఉదారవాద శకంలో సంప్రదాయ చిన్న చిన్న ఉత్పత్తిదారులను, చిన్న పెట్టుబడిదారులను కూడా విస్మరించి కార్పొరేట్-ఫైనాన్స్ బడా పెట్టుబడిదారుల కొమ్ముకాసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉండగా ‘సామాజిక బ్యాంకింగ్’ అనేది రోజురోజుకూ కనుమరుగవుతున్నది. *
_____________________________________
32 కోతపడుతున్న సామాజిక రంగ వ్యయం