తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా !
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన తిరుగుబాటుదారులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు అలా పార్టీ నుంచి బయటకు పోరు.. పార్టీకి విధేయంగా ఉండరు. పక్కలో బల్లెంలా నాయకత్వానికి చికాకు పెడుతూనే ఉన్నారు. ఇది ఒక్క పార్టీకి ప్రధానంగా ఉన్న మూడు పార్టీలకు ఉన్న సమస్య.
బీఆర్ఎస్ పార్టీకి కవిత పెద్ద సమస్యగా మారారు. ఆమెపై చర్యలు తీసుకోరు. ఆమె బయటకు వెళ్లరు. తన పార్టీ బీఆర్ఎస్ అంటారు. కానీ బీఆర్ఎస్ విధానాలకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మోసం అని బీఆర్ఎస్ అంటే… కాదు మంచిదేనని కవిత సంబరాలు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితి ఎదురయింది. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని బహిరంగంగా చెబుతున్నారు. కవితపై చర్యలు తీసుకుంటారని లీకులు ఇస్తున్నారు కానీ అలాంటి ధైర్యం చేయలేకపోతున్నారు. అదే చేస్తే పార్టీ చీలిపోతుంది.
ఇక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు వ్యతిరేకంగా బలమైన వర్గం ఏర్పడుతోంది. పదేళ్లు ముఖ్యమంత్రి నినాదంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి సంకేతం. ఆయన ఒక్కడే కాదు.. కొంత మంది గ్రూపుగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డిని కాదనే పరిస్థితి లేదని తెలిసినా తమ డిమాండ్లను పట్టించుకోవడంలేదని కొంత మంది అసంతృప్తిగానే ఉన్నారు. వీరు రాను రాను బలం పుంజుకునే అవకాశం ఉంది.
ఇక బీజేపీలో బండి వర్సెస్ ఈటల రాజేందర్ గురించి చెప్పాల్సిన పని లేదు. వారి వ్యవహారం హైకమాండ్ కు చేరింది. ప్రస్తుతానికి సర్ది చెప్పినా అది నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది. ఇలా అన్ని పార్టీల్లోనూ రెబల్ స్టార్స్ తమదైన ముద్ర వేస్తున్నారు. వారి సమస్యలు ముదిరి పాకాన పడతాయో.. సర్దుబాటు అవుతాయో వేచి చూడాల్సిందే.